మేడ్చల్ జిల్లా, మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్, నాగారం డివిజన్ రాంపల్లి గ్రామంలో వాలీబాల్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక బీరప్ప టెంపుల్ వద్ద జరిగిన ఈ టోర్నమెంట్ను మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వజ్రేష్ యాదవ్ స్వయంగా సర్వీస్ చేసి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని, క్రీడలు శారీరక దృఢత్వం, క్రమశిక్షణ మరియు ఐక్యతకు ప్రతీకలని వివరించారు.
గ్రామీణ స్థాయిలో ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల మారుమూల ప్రాంతాల్లోని యువత ప్రతిభ వెలుగులోకి వస్తుందని, భవిష్యత్తులో జాతీయ స్థాయికి ఎదిగే అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న జట్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, 'క్రీడా స్ఫూర్తి'తో పోటీలు ఆడాలని ఆయన సూచించారు.
క్రీడల ద్వారా అభివృద్ధి చెందే జట్టు భావన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో ఎంతో దోహదపడుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, టోర్నమెంట్ నిర్వాహక కమిటీ సభ్యులు, క్రీడాకారులు, యువకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.











