రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ ఆదేశించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ బుధవారం ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉపకేంద్రం, బస్తీ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వ రిజిస్టర్, ఓపి రిజిస్టర్లను ఆమె పరిశీలించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. సిబ్బంది సమయపాలన పాటించాలని, వైద్య సేవలను సక్రమంగా అందించాలని ఆమె ఆదేశించారు.
చిన్న పిల్లల టీకాల కార్యక్రమాన్ని కూడా ఆమె పరిశీలించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణలో అప్రమత్తత అవసరమని ఆమె నొక్కి చెప్పారు.
ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యాధికారి డాక్టర్ ప్రీతిఫావని, స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్త, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.












