హెచ్ఐవి సోకిన ప్రతి వ్యక్తి క్రమం తప్పకుండా మందులు వాడాలని, తద్వారా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా వైద్యాధికారి డా. వెంకటి అన్నారు. మొబిలైజేషన్ ఎయిడ్స్ సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో 4135 మంది హెచ్ఐవి తో బాధపడుతున్నారని, వీరంతా క్రమం తప్పకుండా మందులు వాడితే వారి శరీరంలో వైరల్ లోడ్ తగ్గి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని డా. వెంకటి పేర్కొన్నారు.
చికిత్స మధ్యలో ఆపకుండా, ప్రత్యేక శ్రద్ధతో కౌన్సిలింగ్ సేవలు అందించాలని ఆయన సిబ్బందికి సూచించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం, కామారెడ్డి జిల్లా ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో నాలుగో స్థానంలో ఉందని, దీనిని డిసెంబర్ 1వ తేదీ నాటికి మొదటి స్థానానికి తీసుకురావాలని సిబ్బందికి ఆయన ఆదేశించారు.
ముఖ్యంగా యువతలో ఈ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని డా. వెంకటి ఆదేశించారు. ఈ వ్యాధి నివారణకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు.
ఈ సమీక్షా కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ప్రదీప్ కుమార్, డిపిఎం సుధాకర్, డా. ప్రీతి, జిల్లా ఎయిడ్స్ నివారణ సిబ్బంది, మరియు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.












