కామారెడ్డి జిల్లాలో రానున్న పల్స్ పోలియో, నేషనల్ డీవార్మింగ్ డే, స్టాప్ డయేరియా క్యాంపెయిన్ల అమలుపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన జరిగింది.
జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, జూన్ 28న నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, 0-5 ఏళ్ల పిల్లలందరికీ పోలియో చుక్కలు అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె. వెంకట్ మాట్లాడుతూ, కార్యక్రమ అమలుకు 733 బూత్లు, 36 ట్రాన్సిట్ పాయింట్లు, 22 మొబైల్ టీమ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా మిగిలిపోయిన పిల్లలకు టీకాలు అందిస్తామని, వలస ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతామని పేర్కొన్నారు.
నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమం జూలై 13న, మాప్-అప్ రౌండ్ జూలై 20న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 1-19 ఏళ్ల వారికి అల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేస్తారు. స్టాప్ డయేరియా క్యాంపెయిన్ జూన్ 16 నుండి జూలై 31 వరకు కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఓఆర్ఎస్ కార్నర్లు ఏర్పాటు చేసి, ప్రజలకు అవగాహన కల్పిస్తారు.
గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ శాఖ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. డయేరియా కేసులు గుర్తిస్తే తక్షణ వైద్య సేవలు అందించాలని, ఓవర్ హెడ్ ట్యాంకులకు క్లోరినేషన్ నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖకు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమాల విజయవంతానికి అన్ని శాఖలు సహకరించాలని నిర్ణయించారు.












