మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ట్యాక్సీ కారు డ్రైవర్ తన వాహనంతో ఇద్దరిని సుమారు రెండు కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు గాయపడ్డారు.
గాయత్రీ నగర్ నుండి ఎల్.బి. నగర్ వైపు బైక్‌పై వెళ్తున్న ఎస్.కె. జిలానీ, అతని కుమారుడు ఫైసల్ ను వెనుక నుండి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కారు డ్రైవర్ పారిపోవడానికి ప్రయత్నించగా, జిలానీ వాహనాన్ని ఆపడానికి యత్నించాడు. అయితే, డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా, జిలానీని కారు బోనెట్‌పైనే ఉంచుకుని దాదాపు రెండు కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లినట్లు సమాచారం.
ఈ సంఘటనను కొందరు వాహనదారులు వీడియో తీయడంతో అసలు విషయం బయటపడింది. బాధితుడు గాయాలతో నొప్పితో అరుస్తున్నా, డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా రాక్షసత్వం ప్రదర్శించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారు బాలాపూర్ క్రాస్‌రోడ్స్ వరకు వేగంగా వెళ్లి, వెనక్కి తిరిగి, మండమల్లమ్మ జంక్షన్ సమీపంలో స్థానికులు అడ్డగించడంతో నిందితుడు కారును అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం.
ఈ ఘటనలో బాధితుడు ఫైసల్ రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన నగరంలో మరో హిట్ అండ్ రన్ కేసుగా నమోదైంది.











