మే 3న నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షల నేపథ్యంలో, సంగారెడ్డి జిల్లాలోని 6 పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు.
జిల్లాలో గుర్తించిన 6 పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఎస్పీ స్వయంగా పరిశీలించారు. మొత్తం 2,292 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 5:00 వరకు ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు.
పరీక్షా కేంద్రాల పరిసరాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా గుమిగూడటాన్ని నిషేధించినట్లు ఎస్పీ వెల్లడించారు. పరీక్ష కేంద్రాలన్నీ సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని, ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంపై కఠిన ఆంక్షలు విధించినట్లు తెలిపారు.
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో తప్పనిసరిగా తీసుకురావాలని సూచనలు జారీ చేశారు. పారదర్శక వాటర్ బాటిల్ మినహా ఇతర వస్తువులు, నగలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, షూస్, సాక్స్ అనుమతించబడవని స్పష్టం చేశారు.
పరీక్షా సమయానికి ముందే కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశం కల్పించబడదని ఎస్పీ సూచించారు. అభ్యర్థులు ఆందోళన చెందకుండా, నిబంధనలు పాటిస్తూ పరీక్ష రాయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ, డీయస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.












