జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, స్లాబ్ పూర్తయిన ఇళ్లలో వెంటనే గృహప్రవేశాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, శాంక్షన్ అయిన ప్రతి గృహానికి తక్షణమే మార్కౌట్ ఇవ్వాలని, మార్కౌట్ పూర్తయిన ఇళ్లలో బేస్మెంట్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, లబ్ధిదారులకు ఇసుక సులభంగా అందేలా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పనులు ఎక్కడా నిలిచిపోకుండా ఎంపీడీవోలు, ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా, ప్రతి మండలంలో ఒక హాస్టల్‌ను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, విద్యార్థులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.












