రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఊరటనిస్తూ, ఇంటి నిర్మాణానికి సంబంధించిన తుది విడత బిల్లుల చెల్లింపు నిబంధనలను సడలించింది. ఇకపై ఇల్లు నివాసయోగ్యంగా ఉంటే చాలు, అన్ని ఫినిషింగ్ పనులు పూర్తి కాకపోయినా బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇల్లు వంద శాతం పూర్తి కాకపోయినా, నివాసయోగ్యంగా ఉంటే చాలు, తుది విడత బిల్లులు విడుదల చేయాలని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో ఇంటి ఫ్లోరింగ్, లోపలి ప్లాస్టరింగ్, పూర్తిస్థాయి ఎలక్ట్రికల్ వైరింగ్ వంటి ఫినిషింగ్ పనులు పూర్తయితేనే కంప్లీషన్ స్టేజ్ ఫోటోలను అప్లోడ్ చేసి, బిల్లులు పొందే అవకాశం ఉండేది. అయితే, ఆర్థిక స్థోమత లేని లబ్ధిదారులు ఈ పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని, దీంతో తుది విడత బిల్లులు నిలిచిపోతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని, లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశం చేసుకునేలా నిబంధనలను సరళతరం చేసింది.
సవరించిన నిబంధనల ప్రకారం, ఇంటి లోపల ఫ్లోరింగ్, లోపలి వైపు ప్లాస్టరింగ్, లోపలి గదులకు తలుపులు, పూర్తిస్థాయి వైరింగ్, ప్లంబింగ్ పనులు తప్పనిసరి కావు. బయటి వైపు ప్లాస్టరింగ్, ఇంటి ప్రధాన ద్వారం, బయటి వైపు వైట్ వాష్/పెయింటింగ్ ఉంటే సరిపోతుంది. తాత్కాలిక విద్యుత్ కనెక్షన్ ఉన్నా బిల్లులు మంజూరు చేస్తారు.
ఈ మార్పులకు అనుగుణంగా కొత్త మార్గదర్శకాలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటి నిర్మాణ పటిష్టతపై దృష్టి సారించాలని, చిన్న చిన్న హంగుల కోసం బిల్లులు ఆపవద్దని సూచించారు. ప్రభుత్వ ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమమైంది.











