ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, తమ దేశంపై జరిగిన దురాక్రమణలకు ప్రతీకారంగా, శత్రు దేశాలు పశ్చాత్తాపం చెందేంత వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇది అంతర్జాతీయంగా ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ, తమ దేశంపై జరిగిన దురాక్రమణలకు ప్రతీకారంగా, శత్రు దేశాలు పశ్చాత్తాపం చెందేంత వరకు దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ మిత్రదేశం చైనాతో జరిగిన ఫోన్ సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
ఇరాన్ పౌర, రక్షణ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడుల వల్లే టెహ్రాన్‌లో అస్థిరత నెలకొందని అరాగ్చీ తెలిపారు. 'మా లక్ష్యాలన్నీ నెరవేరే వరకు, హింసాత్మక దురాక్రమణకు పాల్పడిన శత్రు దేశాలు పశ్చాత్తాపపడే వరకు ప్రతీకార దాడులు కొనసాగుతాయి. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడమే మా తొలి ప్రాధాన్యం' అని ఆయన పేర్కొన్నారు.
హోర్ముజ్ జలసంధిలో నెలకొన్న అభద్రతకు ఈ దాడులే ప్రత్యక్ష కారణమని అరాగ్చీ అన్నారు. ఈ నేపథ్యంలోనే హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు, తాము తీసుకున్న చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని ఆయన వివరించారు.
మరోవైపు, ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అమెరికా సంకేతాలు పంపుతున్నప్పటికీ, ఇజ్రాయెల్ గూఢచర్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు ప్రారంభించినట్లు ఇరాన్ విప్లవ గార్డ్స్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ఇది పాలనాపరమైన మార్పునకు సంకేతమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న తరుణంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.











