మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహిళా కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత జనగణనలో ఓబీసీల గణన చేపట్టాలని, ఆ తర్వాతే మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలులో 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకుంటామని చెప్పడం మహిళా లోకాన్ని మోసం చేయడమేనని కవిత అన్నారు. జనగణనలో కులం కాలమ్ ఉన్నా, ఓబీసీలకు చెందుతారనే వర్గీకరణ లేకపోవడంతో బీసీల జనాభా లెక్క తేలడం లేదని ఆమె పేర్కొన్నారు. జనగణనలో ఓబీసీలను లెక్కించి, ఆ తర్వాతే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళా కోటా విషయంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై పోరాటానికి బీసీ మహిళలంతా సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశాలకు ముందే డ్రాఫ్ట్ బిల్లును అన్ని పార్టీలకు అందించాలని ఆమె కోరారు. బిల్లుపై చర్చ జరిగే రోజు ఉదయమే సభ్యులకు బిల్లు పత్రాలను ఇస్తామని చెప్పడం అన్యాయం చేసే కుట్ర అని ఆమె మండిపడ్డారు.
డ్రాఫ్ట్ బిల్లును ముందే అందించే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి దేశంలోని జాతీయ పార్టీల నేతలతో మాట్లాడతానని కవిత తెలిపారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు విషయంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ, మహిళలకు న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు ఏకమవ్వాలని ఆమె కోరారు.
దేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు రావటంలో జాగృతి కీలక పాత్ర పోషించిందని కవిత గుర్తు చేశారు. ఈ బిల్లు కోసం ఢిల్లీలో దీక్ష చేసిన సందర్భాన్ని ఆమె ప్రస్తావించారు. దేశంలోని 18 పార్టీలను ఏకం చేసి, బిల్లు కోసం పోరాటం చేసే విధంగా సమన్వయం చేశామని తెలిపారు. జాగృతి వెలిగించిన దీపం ద్వారా దేశంలోని 29 రాష్ట్రాల మహిళలకు మేలు జరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.











