భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి ఎన్నికల అవగాహన, సమాచార ప్రసార సదస్సులో కామారెడ్డి జిల్లా ప్రజాసంబంధాల అధికారి (డీపీఆర్వో) తిరుమల పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియలో సమాచార ప్రచారం, ఓటరు చైతన్యం, సోషల్ మీడియా వినియోగం, తప్పుడు ప్రచారాన్ని అరికట్టే చర్యలు, ఎన్నికల సమయంలో ప్రజలకు పారదర్శకంగా సమాచారాన్ని చేరవేసే విధానాలపై నిపుణులు పలు అంశాలను వివరించారు.
ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రజాసంబంధాల అధికారులు, ఎన్నికల అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో ప్రజాసంబంధాల శాఖ పాత్రను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఆధునిక సమాచార వ్యూహాలపై శిక్షణ అందించారు.
డిజిటల్ మీడియా ద్వారా ఓటర్లలో అవగాహన పెంపొందించే అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఎన్నికల సమాచార నిర్వహణలో నూతన విధానాలపై అవగాహన పెరిగిందని డీపీఆర్వో తెలిపారు.
భవిష్యత్తులో జిల్లాలో ఎన్నికల అవగాహన కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.












