కామారెడ్డి, జూలై 4
నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కామారెడ్డి జిల్లా పోలీసులు శనివారం 'కమ్యూనిటీ కాంటాక్ట్' కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్‌నగర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ పోలీసు-ప్రజల మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు.
ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాల నియంత్రణలో వారి భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా పోలీసులు శనివారం ఉదయం నిర్వహించిన 'కమ్యూనిటీ కాంటాక్ట్' కార్యక్రమం విశేషంగా సాగింది. కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిసరాల్లో ఉదయం 5 నుంచి 8.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 160 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ, పోలీసు-ప్రజల మధ్య విశ్వాసాన్ని బలోపేతం చేయడం, నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి పౌరుడు చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో భాగంగా చేపట్టిన తనిఖీల్లో 121 ద్విచక్ర వాహనాలు, 36 ఆటోలు, 2 కార్లను పరిశీలించారు. వీటిలో 11 వాహనాలు నంబర్ ప్లేట్లు లేకుండా సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఒక తల్వార్, 18 బీర్ బాటిళ్లు, 12 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఇటువంటి ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎస్పీ స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో కత్తులు, తల్వార్లు, ఇతర మారణాయుధాలతో ఫొటోలు, వీడియోలు పోస్టు చేసి యువతను రెచ్చగొట్టేలా లేదా ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా వ్యవహరించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, కొనుగోలు, నిల్వ చట్టరీత్యా నేరమని పేర్కొంటూ, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన, స్నేహాలు, అలవాట్లపై శ్రద్ధ వహించాలని సూచించారు. గంజాయి వ్యసనానికి గురైన వారికి డీ-అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సెలింగ్, చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి పోలీసు శాఖ సహకరిస్తుందని తెలిపారు.
రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎస్పీ, ఉద్యోగాల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఓటీపీ, కేవైసీ, పెట్టుబడి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.












