నెలలు నిండక ముందే పుట్టిన, తక్కువ బరువుతో జన్మించిన శిశువులకు ప్రాణదాతగా కామారెడ్డి సర్వజనని ఆసుపత్రిలోని ప్రత్యేక నవజాత శిశు అంబులెన్స్ సేవలు నిలుస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఈ అంబులెన్స్ ద్వారా చిన్నారులను సురక్షితంగా ఉన్నత వైద్య కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఈ ప్రత్యేక అంబులెన్స్ ద్వారా కామారెడ్డి నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రులకు శ్వాసకోశ ఇబ్బందులు, తక్కువ బరువు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నవజాత శిశువులను తరలించడం జరుగుతోంది. ప్రయాణ సమయంలోనే శిశువులకు అవసరమైన చికిత్స అందించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలు, ఆక్సిజన్ సదుపాయం, అత్యవసర మందులు అందుబాటులో ఉన్నాయి.
వైద్య సిబ్బంది ప్రకారం, ఈ ఏడాది జనవరిలో 65, ఫిబ్రవరిలో 58, మార్చిలో 60, ఏప్రిల్‌లో 60 మంది చిన్నారులను ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించి వారి ప్రాణాలను కాపాడారు. ఈ గణాంకాలు ప్రత్యేక అంబులెన్స్ సేవలు అందించే ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున 33 నవజాత శిశు అంబులెన్స్ వాహనాలను పంపిణీ చేసింది. కామారెడ్డికి 2023 ఆగస్టు 20న అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి T. హరీష్ రావు ఈ అంబులెన్స్‌ను అందజేశారు. అప్పటి నుంచి ఈ సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న తోట కృష్ణ స్వామి గత మూడు సంవత్సరాలుగా ఎంతోమంది చిన్నారులకు సకాలంలో వైద్య సహాయం అందిస్తూ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సేవలు జిల్లా ప్రజలకు ఎంతో భరోసానిస్తున్నాయి.











