కామారెడ్డి పట్టణంలో రాత్రిపూట ఒంటరిగా వెళ్లేవారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి నగదు, విదేశీ కరెన్సీ, స్మార్ట్ఫోన్లు, ఒక స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 18వ తేదీ రాత్రి రాజీవ్‌నగర్ కాలనీ సమీపంలో ఒంటరిగా ఉన్న గుండ్రెడ్డి రాజు రెడ్డి అనే వ్యక్తిని ఐదుగురు అడ్డగించి, బెదిరించి, దాడి చేసి రూ.4 వేల నగదు, ఆధార్ కార్డు, 300 దుబాయ్ దిర్హమ్స్ దోచుకున్నారు. అంతేకాకుండా, బాధితుడి మొబైల్లోని నావీ యాప్ ద్వారా బలవంతంగా రూ.1,000ను యూపీఐ ఖాతాకు బదిలీ చేయించుకున్నారు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెల 21న రాజీవ్‌నగర్‌లోని డీలక్స్ బేకరీ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో, వారు సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాత్రివేళల్లో ఒంటరిగా తిరిగే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. దోచుకున్న దుబాయ్ దిర్హమ్స్ను మార్చుకుని, వచ్చిన డబ్బును పంచుకున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి మొత్తం రూ.8,300 నగదు, ఐఫోన్-15, ఇతర స్మార్ట్ఫోన్లు, బాధితుడి ఆధార్ కార్డు, పర్సు, ఒక హోండా యాక్టివా స్కూటర్, 300 దుబాయ్ దిర్హమ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిరుద్యోగం, తక్కువ ఆదాయం, సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నేరాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించగా, బాల నేరస్తుడిని జువెనైల్ న్యాయ ప్రక్రియ ప్రకారం హాజరుపరిచారు. రాత్రివేళల్లో నిర్జన ప్రాంతాల్లో ఒంటరిగా తిరగవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.








