కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కల నియంత్రణ, నిర్వహణపై జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వీధి కుక్కల స్టెరిలైజేషన్, ప్రజల భద్రత, అవగాహన కార్యక్రమాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్, జిల్లా వెటర్నరీ అధికారి, మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారి తదితరులు పాల్గొన్నారు. వీధి కుక్కల జనాభాను అదుపు చేయడానికి ఏబీసీ (Animal Birth Control) కేంద్రాల ద్వారా స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు, ముఖ్యంగా పిల్లలకు వీధి కుక్కల వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు వీధి కుక్కల పట్ల వ్యవహరించాల్సిన పద్ధతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, దీనికోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న ఏబీసీ సెంటర్‌తో పాటు, మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేయడానికి స్థల, భవన వనరులను గుర్తించాలని అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వీధి కుక్కల నిర్వహణ, నియంత్రణకు సంబంధించిన అన్ని చర్యలను త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు.












