మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ ఎన్నికలపై కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందించారు. చెన్నూరు నియోజకవర్గంలో హింసను ప్రోత్సహిస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, బాల్క సుమన్ వ్యవహార శైలిలో మార్పు లేదని, అందుకే చెన్నూరు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. గత ఎన్నికల్లో చేసిన వ్యాఖ్యల కారణంగానే ప్రజలు గుణపాఠం చెప్పారని, పాత పద్ధతిలో వ్యవహరిస్తే మళ్ళీ ప్రజలు ఊరుకోరని ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు కట్టుబడి ఉన్నామని, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు దీనికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు తమ వంతు సహకారం అందించామని, అయితే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీని బదనం చేసేందుకు ప్రయత్నించి, తమ కాన్వాయ్ పై దాడి చేశారని ఆరోపించారు.
టిఆర్ఎస్ హయాంలో బెదిరించి ఏకగ్రీవాలు చేయడం, ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడం బాల్క సుమన్ చరిత్ర అని విమర్శించిన మంత్రి, బాల్క సుమన్ తరహా బెదిరింపు, రౌడీ రాజకీయాలు తాము చేయబోమని స్పష్టం చేశారు. అలా చేస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని అన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీని, చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి, ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ లకు శుభాకాంక్షలు తెలిపారు.











