తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, రిటైర్డ్ అడిషనల్ డీజీ డీటీ నాయక్ సహా పలువురు బంజారా ప్రముఖులతో సోమవారం హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ నెల 25న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో, బంజారా సమాజానికి చేయాల్సిన కార్యక్రమాలు, వారికి రాజకీయాల్లో కల్పించాల్సిన అవకాశాలపై ఈ భేటీలో చర్చలు జరిగినట్లు సమాచారం.
హైదరాబాద్లోని డీటీ నాయక్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో, బంజారా సమాజం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై కవిత ప్రముఖులతో చర్చించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బంజారాలకు మంత్రివర్గంలో ప్రాతినిథ్యం లేకపోవడం ఇదే మొదటిసారని, తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో వారికి సముచిత అవకాశాలు కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు.
బంజారా ప్రముఖులు తమ పార్టీకి సలహాలు, సూచనలు అందించాలని కవిత కోరారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించాలనుకునే వారికి తమ పార్టీలోకి స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశం రాబోయే రాజకీయ పరిణామాలకు సూచికగా భావిస్తున్నారు.
సమావేశంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ సింగ్ నాయక్, కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ భీమ్లా నాయక్, ట్రైబల్ ఎలక్ట్రిసిటీ బోర్డు అధ్యక్షుడు నారాయణ, తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ నాయక్ వంటి పలువురు పాల్గొన్నారు.











