కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం ప్రాంతంలో పెట్రోల్ కొరత తీవ్రంగా నెలకొంది. భారత్ పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ కోసం వాహనదారులు భారీగా బారులు తీరడంతో బంక్ పరిసరాలు పొడవైన క్యూలతో నిండిపోయాయి.
సూరారం మరియు పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకులలో ఇంధనం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు, రేపటికి పెట్రోల్ దొరకకపోతే తమ పనులకు ఎలా వెళ్లాలనే ఆందోళనతో గంటల తరబడి క్యూలలో నిలబడుతున్నారు.
కొన్ని పెట్రోల్ బంకులు స్టాక్ లేకపోవడంతో మూసివేయబడ్డాయి. దీనితో, అందుబాటులో ఉన్న బంకుల వద్ద రద్దీ మరింత పెరిగింది. ఈ పరిస్థితి వాహనదారులలో అసహనాన్ని పెంచుతోంది.
ప్రభుత్వ యంత్రాంగం ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ఇంధన సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇంధన కొరత వల్ల నిత్యవసర సేవలకు కూడా ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.











