తెలంగాణ రాష్ట్రంలో ఇంధన కొరత లేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఇంధనం కోసం పెట్రోల్ బంకుల వద్ద గుమిగూడ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనవసరంగా క్యూలు కట్టడం వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
డ్రమ్ములు, కంటైనర్లలో ఇంధనాన్ని నింపుకునే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఇటువంటి చర్యలు చట్టవిరుద్ధమని, వాటిని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
వాణిజ్య గ్యాస్‌కు సంబంధించి కొంత ఇబ్బంది నెలకొందని, ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలిపారు. ఈ సమస్యకు ప్రధాన కారణం హైదరాబాద్‌లో వ్యాపిస్తున్న పుకార్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.











