రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వ్యాప్తి చెందుతున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని, గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బ్లాక్ మార్కెటింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే 288 కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు.
శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గ్యాస్ కొరత ఉందనే అసత్య ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని సిలిండర్లను అక్రమంగా నిల్వ చేయడం, మళ్లించడం లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వృద్ధాశ్రమాలకు ప్రాధాన్యత క్రమంలో సరఫరా కొనసాగుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
మరోవైపు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యాసంగి ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులు, నిల్వ సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో పంటల స్థితిగతులను బట్టి సాగునీరు సమృద్ధిగా అందించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మేడ్చల్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి మను చౌదరి, జిల్లాలోని 52 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రతా చర్యల భాగంగా బాట్లింగ్ ప్లాంట్లు, గ్యాస్ సరఫరా వాహనాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. గ్యాస్ డెలివరీలో ఎలాంటి సమస్యలు ఎదురైనా జిల్లా కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నంబర్ 040-29700820ను సంప్రదించాలని తెలిపారు.

