మహబూబాబాద్ జిల్లాలో వేసవిలో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు యాక్షన్ ప్లాన్ ప్రకారం పకడ్ బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో, జిల్లాలోని ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు హ్యాండ్ పంపులు, సంపులు వంటి సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. మిషన్ భగీరథ, ఇంట్ర, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, గ్రామపంచాయతీ, జిల్లా ప్రజా పరిషత్, మున్సిపల్ తదితర ఇంజనీరింగ్ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమస్యలున్న చోట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
అవసరమైతే వాటర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సిద్ధంగా ఉండాలని సూచించారు. రేపు నిర్వహించబోయే మండల సభలో సంబంధిత అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు.
పట్టణంలోని ప్రధాన విద్యాసంస్థలు, ఆస్పత్రులు, కళాశాలలకు నిరంతరాయంగా తాగునీరు అందించాలని మున్సిపల్ శాఖ, మిషన్ భగీరథ సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీలు, మున్సిపల్ పరిధిలలో ఏవైనా తాగునీటి సమస్యలుంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే లేదా విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.
వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఎన్ఎంఆర్ సిబ్బందికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, జిల్లా ప్రజా పరిషత్ సీఈవో పురుషోత్తం, మిషన్ భగీరథ ఇంజనీర్ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.











