కొండాపూర్ మండలం తోగర్పల్లి గ్రామంలో గురువారం జరిగిన గ్రామ సభలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరాలని వారు సూచించారు.
తోగర్పల్లి గ్రామంలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో కమిషనర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ, మహిళలు సాధికారత సాధిస్తే గ్రామాభివృద్ధి సులభతరమవుతుందని అన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులు, వేసవిలో కూలీలకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఆమె పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాబోయే 90 రోజుల్లో శాఖల వారీగా పది ముఖ్య అంశాలపై కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహ జ్యోతి వంటి పథకాల కింద జిల్లాలో జరిగిన లబ్ధి, ఖర్చు వివరాలను ఆమె వెల్లడించారు.
కలెక్టర్ మరిన్ని వివరాలు అందిస్తూ, సన్న రకం వరి ధాన్యానికి బోనస్, చేయూత పథకం, సామాజిక భద్రత పెన్షన్లు, మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయ సంఘాలకు రుణాలు, వడ్డీ లేని ఋణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ, ఆహార భద్రత కింద కొత్త రేషన్ కార్డుల జారీ వంటి పథకాల పురోగతిని వివరించారు. ప్రభుత్వం చేపట్టనున్న కొత్త పథకాల గురించి కూడా ప్రస్తావించారు.
గ్రామ సభలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన కమిషనర్, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం నిర్మాణంలో ఉన్న మహిళా భవనం, గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని, ఉపాధి హామీ పనులను అధికారులు పరిశీలించారు.












