హైదరాబాద్‌లోని మూసీ నది తరహాలోనే మంజీరా నదిని కూడా కాలుష్యం బారినుండి రక్షించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల జీవనాధారమైన మంజీరా నది, లక్షలాది మందికి సాగు, తాగునీటిని అందిస్తోంది. అయితే, హైదరాబాద్‌లోని మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థాలు నక్కవాగు ద్వారా మంజీరా నదిలో కలుస్తున్నాయని, ఇది నది భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు.
మంజీరా నది కాలుష్యానికి కారణమవుతున్న వ్యర్థాలు చివరికి కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్‌లోకి చేరుతున్నాయని, ఈ పరిస్థితిని అరికట్టడానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌లోని చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యల మాదిరిగానే, మంజీరా నది పరిరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
కాలుష్య బాధితుల కోసం పటాన్చెరులో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంపై శ్రీధర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలుష్య ప్రభావిత ప్రాంతాల ప్రజలకు తక్షణ వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్వచ్ఛమైన పర్యావరణం పొందే హక్కు ప్రతి పౌరుడికి ఉందని గుర్తు చేశారు.
నీటి కాలుష్య నివారణ చట్టం–1974ను కఠినంగా అమలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం వెంటనే మంజీరా నది పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, లేదంటే గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మంజీరా నదిని కాపాడుకోవడం ప్రభుత్వంతో పాటు ప్రజలందరి బాధ్యత అని పిలుపునిచ్చారు.











