మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) సభ్యుడు, పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్ పాపారావు, తనతో పాటు సుమారు 12 నుంచి 17 మంది సభ్యులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయారు. దశాబ్దాలుగా పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
పోలీసులు పాపారావుతో పాటు లొంగిపోయిన సభ్యుల నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ పరిణామం ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలకు కొంత ఊరటనిస్తుందని భావిస్తున్నారు. పాపారావు వంటి కీలక నాయకుడి లొంగుబాటుతో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. లొంగిపోయిన సభ్యుల వివరాలు, వారిపై ఉన్న కేసుల గురించి పూర్తి సమాచారం వెలువడనుంది.











