ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు చేపట్టిన సాయుధ పోరాటం కష్టంగా మారిందని, ఈ క్రమంలో అనేక నష్టాలు సంభవించాయని ఆ పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు పసునూరి నరహరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో నరహరి, ఆయన భార్య ధనమ్మను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా నరహరి మాట్లాడుతూ, జార్ఖండ్, తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల్లో సాయుధ పోరాటం ద్వారా ఎదురైన ఇబ్బందులను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశాల కారణంగానే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని స్పష్టం చేశారు. జార్ఖండ్‌లోని మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిరి బిశ్రా అనుమతితోనే తాము ప్రజా జీవితంలోకి వచ్చామని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రజల హక్కుల సాధన చట్టపరంగానే జరగాలని భావిస్తున్నట్లు నరహరి అభిప్రాయపడ్డారు. మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణరావును కూడా ప్రజా జీవితంలోకి రావాలని కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, సాయుధ పోరాటంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మే 12వ తేదీన తెలంగాణ పోలీసులు ఎదుట నరహరి, ధనమ్మ లొంగిపోయారు. వారికి ప్రభుత్వం తరఫున డీజీపీ నగదు చెక్కులను అందజేశారు. అజ్ఞాతంలో ఉన్న 47 మంది మావోయిస్టులు కూడా లొంగిపోవాలని డీజీపీ పిలుపునిచ్చారు.











