మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో 140వ మే డే సందర్భంగా సీఐటియూ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల హక్కులను పరిరక్షించాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటియూ నాయకులు డిమాండ్ చేశారు.
సీఐటియూ జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు మాట్లాడుతూ, మే డే చరిత్రను గుర్తు చేశారు. అమెరికాలోని చికాగోలో కార్మికులు తమ హక్కుల కోసం పోరాడుతూ పోలీసుల కాల్పుల్లో అమరులైనారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా కార్మికులకు 8 గంటల పని దినం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఎర్రజెండా కార్మికుల, కర్షకుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతుందని, 'ప్రపంచ కార్మికులారా ఏకంకండి' అనే నినాదం స్ఫూర్తితో నేటికీ అనేకమంది కార్మికులు తమ హక్కులను సాధించుకుంటున్నారని పేర్కొన్నారు.
నాటి చికాగో అమరవీరుల స్ఫూర్తితో నేటి కార్మికులు, కర్షకులు అందరూ కలిసి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో దేశ ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కొనసాగించాలని, నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటియూ జిల్లా కోశాధికారి నర్సమ్మ, నాయకులు అన్నపూర్ణ, పుష్ప, రాములు, రిజ్వనా, భీమేష్, నర్సింలు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ర్యాలీలో సీఐటియూ జెండాలను ఎగరేస్తూ, కార్మికులు తమ డిమాండ్లను తెలియజేస్తూ పట్టణంలో ప్రదర్శన చేశారు.









