షెడ్యూల్డు కులాల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26ను పకడ్బందీగా అమలు చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్ అధికారులను, బ్యాంకర్లను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక బ్యాంకర్ల (డీసీసీ) సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ఎస్సీ యువత ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ క్రమంలో పలు యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, త్రీ వీలర్ యూనిట్లు, సోలార్ పంప్ కంట్రోల్ యూనిట్లపై సబ్సిడీ వివరాలను ఆయన వివరించారు.
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల యూనిట్లపై 90% సబ్సిడీతో గిగ్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, దీనికి 215 యూనిట్లు కేటాయించినట్లు తెలిపారు. త్రీ వీలర్ యూనిట్లపై 70% సబ్సిడీతో 106 యూనిట్లు, సోలార్ పంప్ కంట్రోల్ యూనిట్లపై 60% సబ్సిడీతో 22 యూనిట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు.
అర్హులైన అభ్యర్థులు మార్చి 24వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. బ్యాంకర్లు దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని, యూనిట్ల గ్రౌండింగ్‌లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు కె. బాబు మొజెస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ సి. శివ ప్రసాద్‌తో పాటు పలు బ్యాంకుల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.







