నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కార్యకర్తలు వ్యక్తుల కంటే పార్టీకే ప్రాధాన్యతనిచ్చి పనిచేయాలని పిలుపునిచ్చారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అర్బన్ శిక్షణా తరగతులు మంగళవారం విజయలక్ష్మి గార్డెన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, పార్టీ కండువా ధరించడం అదృష్టమని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్తూ, హిందువుల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో జరిగిన సంస్కరణలను ప్రస్తావిస్తూ, ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమం ద్వారా దేశాన్ని ఆర్థిక, సాంకేతిక రంగాల్లో స్వయం సమృద్ధిగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ‘వోకల్ ఫర్ లోకల్’ నినాదంతో స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహం లభిస్తోందని చెప్పారు.
స్థానిక పరిశ్రమల అభివృద్ధి, స్వయం ఉపాధి పెంపు ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యమని, విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్య, వైద్య రంగాల్లో జరిగిన అభివృద్ధిని కూడా ఆయన ప్రస్తావించారు.
జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ, పార్టీలో పనిచేసేవారు శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొనడం అవసరమని, మారుతున్న కాలానికి అనుగుణంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్త ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.












