ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర (MSP) ప్రకారం మొక్కజొన్నను కొనుగోలు చేయాలని, మధ్య దళారుల వ్యవస్థను అరికట్టాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మందుల రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తిరుమలాయపాలెం మండలంలోని తిప్పారెడ్డిగూడెం గ్రామంలో జరిగిన పార్టీ సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, 2025-26 సీజన్‌కు గాను ప్రభుత్వం మొక్కజొన్న MSPని క్వింటాల్‌కు రూ.2,400గా ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులకు ఈ ధర లభించడం లేదని ఆరోపించారు.
ప్రభుత్వం నేరుగా ఐకెపి సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, తేమ శాతం పేరుతో తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న దళారుల బారి నుండి రైతులకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. దీనివల్ల రైతులు క్వింటాల్‌కు రూ.600 నుండి రూ.800 వరకు నష్టపోతున్నారని తెలిపారు.
మార్కెట్ యార్డులలో కొనుగోలుదారులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు అడుగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయని, పంట చేతికి వచ్చిన 15-20 రోజుల వరకు కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోందని గొర్రెపాటి రమేష్ అన్నారు. నిల్వ సదుపాయం లేక, వర్ష భయంతో రైతులు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని మండల కేంద్రాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధరకు నేరుగా రైతుల నుండి కొనుగోలు చేయాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










