నిజామాబాద్ మరియు జగిత్యాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు బీజేపీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు.
నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ కమ్మ సంఘం ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే అత్యధిక కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలను బీజేపీ గెలుచుకుందని ఎంపీ అర్వింద్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తాను, ఎంపీ ఈటెల రాజేందర్ కలిసి కృషి చేస్తామని ఎంపీ అర్వింద్ తెలిపారు. తాము ఎవరినీ కొనుగోలు చేసి రాజకీయాలు చేయమని ఆయన స్పష్టం చేశారు. నిజామాబాద్ నగరంలో మేయర్ పదవిని కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కలిసి కైవసం చేసుకున్నాయని, ప్రజల ఆశీర్వాదంతో కాకుండా రాజకీయ కుమ్మక్కుతో ఆ పదవిని దక్కించుకున్నారని ఆయన ఆరోపించారు.
రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుందని ఎంపీ అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఇందూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా హుందాగా ఉండే నాయకుల్లో ఎంపీ ఈటల రాజేందర్ ఒకరని అర్వింద్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ, గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. నగర అభివృద్ధి కోసం అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడి తీసుకొస్తానని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ, భవిష్యత్తులో నిజామాబాద్ మేయర్ పీఠాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

