సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల (ఓబీసీ) రిజర్వేషన్లను ముస్లింలకు వర్తింపజేయడం దుర్వినియోగమని, దీనిపై సమగ్ర సమీక్ష జరపాలని రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాజ్యసభలో జీరో అవర్లో మాట్లాడుతూ, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగమని ఆయన ఆరోపించారు. కొన్ని రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కల్పిస్తున్నాయని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని లక్ష్మణ్ పేర్కొన్నారు.
తెలంగాణలో గతంలో ఓబీసీ జాబితాలో లేని ముస్లింలకు ప్రత్యేకంగా 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని, దీనిని హైకోర్టు కొట్టివేసినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లను 12 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఓబీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలే ప్రయోజనం పొందుతున్నారని ఆయన ఆరోపించారు.
మత ప్రాతిపదికన కల్పిస్తున్న ఇలాంటి రిజర్వేషన్లపై సమగ్రంగా సమీక్ష జరపాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లక్ష్మణ్ వ్యాఖ్యలకు నిరసనగా విపక్ష సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ విషయంపై స్పందించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, గతంలో ఏపీ హైకోర్టు ముస్లిం రిజర్వేషన్లను కొట్టివేసిందని, ఓబీసీ కేటగిరీ హిందువుల కోసమేనని, అయితే విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కులమతాల ప్రాతిపదికన విభజించాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు.











