వరంగల్ జిల్లా కాశీబుగ్గ SRనగర్ ప్రాంతంలో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో, భర్త రోకలిబండతో భార్య తలపై బలంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది.
ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న అబ్బరబోయిన రాజు, తన భార్య అనిత (40)తో గొడవ పడుతూ, తీవ్ర ఆగ్రహంతో ఆమె తలపై రోకలిబండతో దాడి చేశాడు. ఈ దాడిలో అనిత తీవ్ర గాయాలపాలైంది.
కుటుంబ సభ్యులు వెంటనే అనితను ఎంజీఎం ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
సమాచారం అందిన వెంటనే ఇంతేజార్గంజ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలి భర్త రాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
కుటుంబ సమస్యలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

