పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు నాయుడుపేట ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారం నేపథ్యంలో, పట్టణ ప్రజలు, ఇళ్ల యజమానులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని టౌన్ సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం నిఘా పెంచింది.
సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పట్టణంలో ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు అపరిచితులకు ఇళ్లు ఇచ్చే ముందు వారి పూర్తి వివరాలను సేకరించాలని కోరారు. కొత్తగా వచ్చేవారి గుర్తింపు కార్డులను తప్పనిసరిగా సరిచూసుకోవాలని, వారి పూర్వపరాలను, ఎక్కడి నుండి వచ్చారనే విషయాన్ని క్షుణ్ణంగా విచారించాలని సూచించారు.
పట్టణంలో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు, కొత్త ముఖాలు తారసపడితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అనుమానితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ఆయన హెచ్చరించారు.
పట్టణ భద్రత కోసం పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ భరోసా ఇచ్చారు. అక్రమ చొరబాటుదారులపై సమాచారం ఉందని, అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని ఆయన పునరుద్ఘాటించారు.











