రాజకీయాల్లో పదవులు అంతిమ లక్ష్యం కాదని, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల సేవలో నిమగ్నమవుతానని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ లో ఆయన పలు వార్డులలో పర్యటించి, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్థానిక కౌన్సిలర్లు నీలం కవిత, సంతోష దస్తగిరి, జ్యోతి గోపాల్ లతో కలిసి పర్యటించిన సందర్భంగా, ఎన్నికల ప్రచారంలో గుర్తించిన విద్యుత్ స్తంభాలు, బోర్ వాటర్, వీధి దీపాల వంటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన నేరుగా పరిశీలించారు.
ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, అయితే కొందరు కుట్రల ద్వారా కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో అధికారం చేపట్టకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఈ కుట్రలకు భయపడబోనని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ముందుకు సాగుతానని ఆయన తెలిపారు.
ప్రజా సేవకు పదవులే అవసరం లేదని, తనను నమ్ముకున్న వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.


