దేశ ఆర్థిక వ్యవస్థపై నిరాశావాద ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని, బాహ్య సవాళ్లు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. సోమవారం 37వ ఎస్ ఐ డి బి ఐ ఫౌండేషన్ వేడుకలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో అధిక శాతం బాహ్య కారణాల వల్లేనని, బంగారం, ఇంధనం, దిగుమతుల కోసం విదేశీ మారకద్రవ్య అవసరాలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కొందరు నిరాశావాద ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు.
భారతదేశ ఆర్థిక పునాదులు అత్యంత సానుకూలంగా, పటిష్టంగా ఉన్నాయని, అంతర్జాతీయంగా తీవ్రమైన బాహ్య సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఈ పరిస్థితి కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా ఏర్పడిన అనిశ్చితి, వ్యాపారాలపై, ప్రజలపై పడుతున్న ప్రభావాన్ని మంత్రి సుదీర్ఘంగా విశ్లేషించారు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో పౌరులను రక్షించడం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) పూర్తి మద్దతు ఇవ్వడం, సరఫరా గొలుసులను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన విధానమని ఆమె పునరుద్ఘాటించారు.
దేశాన్ని ప్రస్తుతం మూడు ప్రధాన బాహ్య సవాళ్లు (3 'F's) వేధిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు గత 80-90 రోజులుగా తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని, ఈ కారణంగానే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారని మంత్రి వివరించారు.











