సంగారెడ్డి, జూలై 29
హత్నూర మండలం కాశాల రైతు వేదికలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య ముఖ్య అతిథిగా పాల్గొని, రైతులు, మహిళలు, గ్రామస్థులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. నాల్సా జాగృతి పథకం ద్వారా ప్రజలు ఉచిత న్యాయ సహాయం, సలహాలు పొందవచ్చని ఆమె తెలిపారు.
జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు, జిల్లా అధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి.సౌజన్య హత్నూర మండలం కాశాల రైతు వేదికలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ముఖ్య అతిథిగా పాల్గొని రైతులు, మహిళలు, గ్రామస్థులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె నాల్సా జాగృతి (JAGRITI) పథకం గురించి వివరిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తమ న్యాయ హక్కులను తెలుసుకొని, అవసరమైనప్పుడు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం, న్యాయ సలహాలు, మధ్యవర్తిత్వ సేవలు మరియు ఇతర న్యాయ సేవలను పొందవచ్చని తెలిపారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని, మహిళలు, చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన వర్గాలు తమకు చట్టపరంగా కల్పించిన హక్కులను వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే రైతు వేదికలలో నిర్వహిస్తున్న విత్తన మేళా ప్రాముఖ్యతను వివరించి, ధృవీకరించిన నాణ్యమైన విత్తనాలను వినియోగించడం, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించడం, ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు. ప్రజలు న్యాయ సేవల కోసం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళలు, గ్రామస్థులు మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.











