పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభలో తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కవిత మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం కూడా ప్రాజెక్టు విషయంలో ప్రజలకు ద్రోహం చేశాయని ఆరోపించారు. ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సాధన సభ మహబూబ్ నగర్ జిల్లా చౌదరిగూడెంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నీళ్లు దక్కలేదని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రోళ్లను నిందించినట్లే, ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని ఆమె అన్నారు.
తెలంగాణకు నీటి విషయంలో జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకే తెలంగాణ రక్షణ సేన పుట్టిందని కవిత తెలిపారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ రెండున్నరేళ్లు అధికారంలో ఉన్నా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు కనీసం 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఆమె విమర్శించారు. ప్రాజెక్టు కోసం 33 వేల కోట్లు ఖర్చు చేసినా, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని బీఆర్ఎస్ దుర్వినియోగం చేసిందని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి తెచ్చిన జీవో 72 ను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక బేషజాలకు పోయి శ్రీశైలంకు సోర్స్ పాయింట్ మార్చిందని, ఇది క్షమించరాని నేరమని కవిత అన్నారు. ఆ తర్వాత నీళ్లు తీసుకునే ఎత్తును కూడా పెంచి, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అప్రోచ్ ఛానెల్ ను కుదించారని ఆరోపించారు. రిజర్వాయర్లు కట్టారు కానీ అవసరమైన చిన్న కాలువలు కట్టలేదని, శ్రీశైలం కు సోర్స్ పాయింట్ మార్చడం వల్ల ప్రతిరోజూ ఆంధ్రాతో పంచాయితీ అవుతోందని ఆమె వివరించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ చేసిన తప్పునే కొనసాగిస్తోందని, రిజర్వాయర్లు కట్టి కమిషన్లు దండుకున్నారే తప్ప చుక్క నీళ్లు తేలేదని కవిత విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని, పాలమూరు బిడ్డలు కాంగ్రెస్ కు 12 సీట్లు ఇచ్చినా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తి పోయలేదని ఆమె అన్నారు. దసరా నాటికి పాలమూరు-రంగారెడ్డి పనులను ప్రభుత్వం ప్రారంభించాలని, లేదంటే ప్రాజెక్ట్ పరివాహాక ప్రాంతంలో పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు.







