పెద్దపల్లి రైల్వే స్టేషన్లో యూరియా బస్తాల అన్లోడింగ్ ప్రాంతాన్ని, ధాన్యం రవాణా పరిస్థితులను రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి డిసిపి శ్రీ బి.రామ్ రెడ్డి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పాటు హమాలీలతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కార చర్యలపై చర్చించారు.
ప్రస్తుతం వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రవాణా కోసం అధిక సంఖ్యలో లారీలను వినియోగిస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న యూరియా ఎరువుల రవాణాకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని డిసిపి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రెవెన్యూ, వ్యవసాయ శాఖ తదితర ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కరీంనగర్ ప్రాంతాలకు చెందిన లారీ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
వరి, మొక్కజొన్న రవాణా ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగడంతో పాటు, రైతులకు అవసరమైన యూరియా సరఫరా కూడా నిలిచిపోకుండా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని డిసిపి అధికారులకు సూచించారు. యూరియా బస్తాల సరఫరా ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సహకారంతో పనిచేయాలని ఆయన తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువుల సరఫరా జరిగేలా చూడాలని సూచించారు.
అదేవిధంగా, రైల్వే వ్యాగన్ల నుంచి యూరియా బస్తాలను లారీలలోకి ఎక్కిస్తున్న హమాలీల దాహార్తిని తీర్చేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని పెద్దపల్లి డిసిపి శ్రీ బి.రామ్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై నరేష్, వివిధ శాఖల అధికారులు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, హమాలీలు పాల్గొన్నారు.











