రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మొత్తాన్ని సకాలంలో చెల్లింపులు జరపాలని, కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏవోలు, ఏపీఎంలు, కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు, సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో డాటా ఎంట్రీ, ట్రక్ షీట్ జనరేషన్ ప్రక్రియలను జాగ్రత్తగా నిర్వహించాలని సూచించారు.
24 గంటల్లో పురోగతి కనిపించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించిన కలెక్టర్, రైస్ మిల్లుల వద్ద లారీలు నిలిచిపోకుండా తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మిల్లర్లు సహకరించని పక్షంలో వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. హమాలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, మిల్లుల వద్ద పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమన్వయంతో ధాన్యం రవాణా, అన్లోడింగ్ సజావుగా జరిగేలా చూడాలని కోరారు.
ప్రతిరోజూ మండలాల వారీగా, మిల్లర్ల వారీగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ జనరేషన్ వివరాలను సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఇప్పటివరకు 5,32,655 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు, 5,573 మంది రైతులకు రూ.89.85 కోట్లు చెల్లించినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి బాల సరోజ తెలిపారు. మార్కెటింగ్ డీఎం శ్రీకాంత్, ఇప్పటివరకు 3,520 టార్పాలిన్ కవర్లు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.












