నిజామాబాద్, జూలై 26
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించగా, వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హన్మకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకున్న వెంటనే ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని గుర్తించిన వైద్యురాలు డాక్టర్ మమత రెడ్డి అత్యవసర చికిత్స ప్రారంభించారు. గుండె స్పందన నిలిచిపోవడంతో పలుమార్లు సీపీఆర్ నిర్వహిస్తూ నిరంతర వైద్య సేవలు అందించారు. ఆమె సమయోచిత చర్యలు, అంకితభావంతో చేసిన చికిత్స ఫలించి సుదర్శన్ రెడ్డి గుండె మళ్లీ స్పందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతూ కోలుకుంటున్నట్లు సమాచారం.
క్లిష్ట సమయంలో డాక్టర్ మమత రెడ్డి చూపిన సమయస్ఫూర్తి, వైద్య నైపుణ్యాన్ని మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశంసించారు. ఆమె అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. బీఆర్ఎస్ శ్రేణులు, వైద్య సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు కూడా డాక్టర్ మమత రెడ్డిని అభినందించారు.












