కామారెడ్డి, జూలై 11
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో విధుల్లో ఉన్న బీఎల్ఓ అధికారిపై దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోటో లేని ఎన్యూమరేషన్ ఫారం సమర్పించడంతో పాటు, అసభ్య పదజాలంతో దూషించి, అధికారిక కిట్‌ను లాక్కొనే ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న బీఎల్ఓ అధికారిపై దురుసుగా ప్రవర్తించి, విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. రామేశ్పల్లి గ్రామానికి చెందిన బీఎల్ఓ అధికారి శ్రీమతి ఠాకూర్ అనిత శుక్రవారం లిమ్రా ఫంక్షన్ హాల్ సమీపంలో ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ విధులు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఉజ్మా బేగం ఫోటో జతచేయని ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించగా, నిబంధనల ప్రకారం ఫోటో లేకుండా ఫారాన్ని స్వీకరించలేమని బీఎల్ఓ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉజ్మా బేగం తాను బంగ్లాదేశ్‌కు చెందినదానినని చెప్పడంతో, నిబంధనల మేరకు ఫారాన్ని తీసుకోవడానికి బీఎల్ఓ నిరాకరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో ఉజ్మా బేగంతో పాటు మరో మహిళ బీఎల్ఓతో వాగ్వాదానికి దిగారని, అసభ్య పదజాలంతో దూషిస్తూ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా బీఎల్ఓ చేతిని పట్టుకుని తోసివేయడంతో పాటు ఆమె వద్ద ఉన్న అధికారిక కిట్‌ను లాక్కొనే ప్రయత్నం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇంతలో అక్కడికి వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి కూడా బీఎల్ఓను చంపేస్తానంటూ బెదిరించినట్లు సమాచారం. అక్కడే ఉన్న సూపర్వైజర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
బీఎల్ఓ ఠాకూర్ అనిత ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 534/2026గా కేసు నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 132, 324(2), 351(3), 352తో పాటు 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.











