గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డు (జి.ఆర్.ఎం.బి) చైర్మన్ పీ. దోర్జీ గ్యాంబ మంగళవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి, పనుల పురోగతిని సమీక్షించారు.
పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్న చైర్మన్ దోర్జీ గ్యాంబకు, ప్రాజెక్ట్ అధికారులు ఘనస్వాగతం పలికారు. వీరిలో పీపీఏ సీఈఓ సంజీవ్ వోహ్రా, డిప్యూటీ డైరెక్టర్ రవి, పోలవరం ప్రాజెక్ట్ ఎస్ఈ ఆర్. రామచంద్ర రావు, ఇతర ఈఈలు, డీఈఈలు, ఎం.ఈ.ఐ.ఎల్ జనరల్ మేనేజర్ ఏ. గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళి పమ్మి ఉన్నారు.
అధికారులతో కొద్దిసేపు సమావేశమైన అనంతరం, చైర్మన్ ప్రాజెక్టులోని కీలక భాగాలైన స్పిల్ వే, ఎగువ కాఫర్ డ్యామ్, గ్యాప్ 1, 2 లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటివరకు పూర్తిచేసిన పనుల వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పనులు జరుగుతున్న తీరుపై చైర్మన్ దోర్జీ గ్యాంబ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రాజెక్టు పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచనలు జారీ చేశారు.
ఈ పర్యటన ప్రాజెక్టు నిర్మాణంలో తదుపరి దశలను వేగవంతం చేయడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.







