సమాజం, భావితరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పిలుపునిచ్చారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం న్యాల్కల్ గ్రామ సచివాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, శాంతియుత వాతావరణం ఉన్న ప్రాంతాలే వేగంగా అభివృద్ధి చెందుతాయని కమిషనర్ అన్నారు. నేరాల నియంత్రణకు, నేరస్థుల గుర్తింపునకు సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ప్రతి గ్రామం, కాలనీ, వ్యాపార సంస్థల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు రావాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు వెల్లడించవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే గ్రామ పోలీసు అధికారి లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. రహదారి ప్రమాదాల నివారణకు గ్రామస్థాయిలో రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.
అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కమిషనర్ స్పష్టం చేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. పంటల మార్పిడి, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనం పెంపు, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, తడి–పొడి చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వివరించారు.







