జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు మే 15 నుంచి జూన్ 16 వరకు ప్రత్యేక సభ్యత్వ నమోదు డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ముమ్మరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గౌరవ తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచనలు, గవర్నర్ కార్యదర్శి దానకిషోర్ ఉత్తర్వుల మేరకు ఈ డ్రైవ్‌ను చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రత్యేక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరిని రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మరియు స్పెషల్ ఆఫీసర్‌గా, కార్మిక శాఖ సహాయ కమిషనర్ డాక్టర్ శశికుమార్‌ను జిల్లా నోడల్ అధికారిగా నియమించారు.
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా సభ్యత్వం తీసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సాధారణ ప్రజలు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా పెద్దఎత్తున ముందుకు వచ్చి రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు.
సభ్యత్వ నమోదు కోసం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని నోడల్ రిజిస్ట్రేషన్ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఆసక్తి గలవారు నేరుగా కలెక్టరేట్లో లేదా redcross.cgg.gov.in వెబ్సైట్ ద్వారా, అలాగే TELANGANA RED CROSS మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
పాట్రన్, వైస్ పాట్రన్, లైఫ్ మెంబర్, లైఫ్ అసోసియేట్, వార్షిక సభ్యత్వ విధానాల్లో చేరే అవకాశం కల్పించారు. ఈ డ్రైవ్‌ను యుద్ధప్రాతిపదికన నిర్వహించి, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.











