కామారెడ్డి జిల్లాలో ఒక రైస్ మిల్లుకు భారీగా బియ్యం బకాయిలు ఉన్నప్పటికీ, మళ్లీ ధాన్యం కేటాయించడంపై ఇతర రైస్ మిల్లర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వానికి నష్టం కలిగించే అవకాశం ఉందని వారు ఆరోపిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలానికి చెందిన ఫరా బాయిల్డ్ రైస్ మిల్ వ్యవహారం సివిల్ సప్లై శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ మిల్లుకు కోట్ల రూపాయల విలువైన బియ్యం బకాయిలు ఉన్నాయని, అయినప్పటికీ మళ్లీ ధాన్యం కేటాయించడంపై ఇతర మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైస్ మిల్లర్ల వర్గాల సమాచారం ప్రకారం, 2024-25 రబీ సీజన్‌కు సంబంధించిన సుమారు 78 ఏసీకేలు, 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన మరో 121 ఏసీకేలు బియ్యం పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపణలున్నాయి. మొత్తం బకాయిలు రూ.20 కోట్లకు పైగా ఉంటాయని కొందరు మిల్లర్లు పేర్కొంటున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధిత మిల్లుకు 2025-26 రబీ సీజన్ ధాన్యం కేటాయించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 100 శాతం సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అప్పగించిన మిల్లులకు ధాన్యం ఇవ్వకుండా, బకాయిలున్న మిల్లులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నిజాయితీగా పనిచేసే మిల్లర్లు నష్టపోతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత రైస్ మిల్ ఆస్తుల విలువ రూ.10 కోట్లు మాత్రమే ఉండగా, అందులోనూ బ్యాంకు రుణాలు రూ.5 కోట్లు ఉన్నాయని, రూ.20 కోట్లకు పైగా ప్రభుత్వ బకాయిలు ఎలా వసూలు చేస్తారని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వ ఖజానాపై భారం మోపి, సివిల్ సప్లై శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఇకపై ఏ సీజన్‌కు సంబంధించిన ధాన్యం అయితే, అదే సీజన్లో సీఎంఆర్ బియ్యం పూర్తిగా ముట్టజెప్పిన తర్వాతే తదుపరి ధాన్యం కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.











