ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న 'అరైవ్ అలైవ్' కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేసిన అధికారులు, నివారణ చర్యలపై దృష్టి సారించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో, రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా చర్చించారు. ప్రపంచంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు భారతదేశంలో జరుగుతున్నాయని, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు ఎక్కువగా మరణిస్తున్నారని అధికారులు తెలిపారు. ప్రజా సంక్షేమం, భద్రతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు.
'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని, ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నియమాలను అందరూ పాటించడం సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్టీసీ, స్కూల్ బస్, ఆటో డ్రైవర్లకు వైద్య పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు.
పాఠశాలల వద్ద సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, వాహనదారులు సీటు బెల్ట్ ధరించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి గ్రామంలో రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, జిల్లాలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, గ్రామ సభల ద్వారా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని, డ్రైవర్లకు కంటి పరీక్షలు, సీపీఆర్ పై శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.











