ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా పోరాడాలని, ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందని ఆయన అన్నారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మబలిదానాలకు ఒడిగట్టవద్దని కోరుతున్నానని, శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఆర్టీసీలో ఇలాంటి దురదృష్టకర పరిస్థితి తలెత్తిందని, శంకర్ గౌడ్ ఆత్మబలిదానానికి కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు.
అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి మాట తప్పారని, పీఆర్సీలతో పాటు కార్మికుల డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏవీ నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే ప్రభాకర్ విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయకుండా రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని, ఇంకా ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాడుదామని, కార్మికుల వెంటే తాము ఉన్నామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, సమస్యల నివారణకు తక్షణ చర్యలు చేపట్టి వారిలో విశ్వాసం కల్పించాలని కోరారు.












