రాష్ట్రంలో సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పటిష్టంగా అమలు చేస్తామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రూ.2.50 కోట్లతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు.
రూ.2.50 కోట్లతో ఎకరం పది గుంటల స్థలంలో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి డీజీపీతో పాటు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితేలు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, రాష్ట్రంలో మావోయిజం అంతమైందని, ప్రజలే కేంద్రంగా సేవలు అందించేలా పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని వెల్లడించారు.
రోడ్డు భద్రతపై డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా 'అరైవ్.. అలైవ్' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. వేములవాడలో ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లు, భీమారంలో నూతన పోలీస్ స్టేషన్ మంజూరుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నామని, రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు గట్టి చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే జిల్లాలో డి-అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించామని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే కూడా పోలీస్ స్టేషన్ ఆవశ్యకతను, చేపడుతున్న భద్రతా చర్యలను వివరించారు.
శంకుస్థాపన కార్యక్రమం అనంతరం డీజీపీ బి. శివధర్ రెడ్డి వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న డీజీపీకి అర్చకులు వేదమంత్రాలతో ఘనస్వాగతం పలికి, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు.











