జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న సాదా బైనమా, భూభారతి దరఖాస్తులు, ఎస్ఐఆర్ మ్యాపింగ్ మరియు ఇతర భూ సమస్యలపై జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం తాసిల్దారులు, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ప్రభుత్వం సడలించిన నిబంధనల ప్రకారం సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నోటీసులు జారీ చేసి, వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మండలాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలను తెలుసుకున్న కలెక్టర్, నిర్దేశిత గడువులోగా అన్ని భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, డిలీషన్ ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగానే జరగాలని సూచించారు.
మరణించిన వ్యక్తుల పేర్ల తొలగింపు విషయంలో సరైన ధ్రువీకరణ అనంతరం మాత్రమే చర్యలు తీసుకోవాలని, ఈ ప్రక్రియలో బిఎల్వోలు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.
పాల్వంచ, దమ్మపేట, కరకగూడెం వంటి మండలాల్లోని అటవీ, రెవెన్యూ, ఇతర భూ సమస్యలపై సమగ్ర నివేదికలను రేపటిలోగా సమర్పించాలని తాసిల్దారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.










