సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్‌ను తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి, ఉద్యోగుల సమస్యలను, సంక్షేమాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్‌ను, జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ అలీ, కార్యదర్శి నాగరాజు, జిల్లా టౌన్ అధ్యక్షుడు వి.పండరి ఆధ్వర్యంలో సంఘం నాయకులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, సంక్షేమం, పారదర్శక పరిపాలన, సమర్థవంతమైన సేవలందించడం వంటి అంశాలపై చర్చించారు.
జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడానికి ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేయాల్సిన అవసరాన్ని నాయకులు కలెక్టర్‌కు వివరించారు. ఉద్యోగుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా కోరారు.
కలెక్టర్ శ్రీ ప్రతీక్ జైన్ ఉద్యోగుల ప్రతినిధుల వినతులను సానుకూలంగా స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడంలో కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో క్లాస్ ఫోర్త్ అసోసియేషన్ ఎండి అప్సర్, ప్రచార కార్యదర్శి ఎం.బిక్షపతి, ఆఫీస్ కార్యదర్శి ఎం.బాలకృష్ణ, కార్యవర్గ సభ్యులు జి.రాములు, సమీకృత కార్యదర్శి పి.అశోక్, సహాయ అధ్యక్షులు, సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.












